సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్‌లోని సుమారు 700లకు పైగా ఉన్న బోట్లకు పోర్టు అధికారులు విధిస్తున్న జెట్టీ ఫీజుపై అదనపు భారాన్ని తగ్గించాలని విశాఖ డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విశాఖపట్నం పోర్టు అథారిటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్(సీఎంఈ) సీహెచ్ రామ్ ప్రసాద్‌ను అసోసియేషన్ ప్రతినిధులు శనివారం కలిసి వినతి పత్రం అందించారు. ప్రతి బోటుకు రూ.612 జెట్టీ ఫీజుతో పాటు, అదనంగా 18 శాతం జీఎస్టీ, 15 శాతం వడ్డీ చార్జీలను పోర్టు అథారిటీ వసూలు చేస్తోందనీ.. వెంటనే తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ వీర్రాజు, ఉపాధ్యక్షులు సీహెచ్ పోతురాజు, ఎం. రాము, జాయింట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.


