అల్లిపురం: నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 102 ట్యాంకర్లతో రోజుకు సుమారు 400 ట్రిప్పులు నిర్వహించి అవసరమైన ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన నీటిని అందించాలని అధికారులను కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఆరిలోవ 11, 12, 13వ వార్డులతోపాటు భీమిలి, ముడసర్లోవ పరిసర ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. నగరంలోని ప్రధాన నీటి వనరుల పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని కమిషనర్ తెలిపారు. ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటిమట్టం 154.11 అడుగులుగా ఉందన్నారు. అయినప్పటికీ నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ట్యాంకర్ల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. నీటి సరఫరాను అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
977 అభ్యర్థనలు.. 619 డెలివరీలు
‘డయల్–ఏ–ట్యాంకర్’ సేవకు ఈనెల 8వ తేదీ సాయంత్రం 6.14 గంటల వరకు 977 అభ్యర్థనలు అందాయి. వీటిలో 619 ట్యాంకర్ డెలివరీలు పూర్తయ్యాయి. మరో 50 అభ్యర్థనలు రద్దు లేదా స్పందన లేకపోవడంతో నిలిచిపోగా, 308 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇంటి నుంచే ట్యాంకర్ బుకింగ్
ప్రజలు జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇంటి నుంచే ట్యాంకర్‌ను బుక్ చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ట్యాంకర్ల కేటాయింపు అందుబాటులో ఉన్న ట్యాంకర్‌ను సమీప ప్రాంతానికి కేటాయించే విధానంలో జరుగుతుందన్నారు.
ట్యాంకర్ చార్జీలు ఇవీ..
నీటి చార్జీ కిలో లీటర్‌కు రూ.40గా నిర్ణయించారు. ట్యాంకర్ సామర్థ్యాన్ని బట్టి డ్రైవర్ చార్జీలు కలిపి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
సామర్థ్యం మొత్తం చార్జీ
1 కేఎల్ రూ.390
2 కేఎల్ రూ.550
5 కేఎల్ రూ.900
6 కేఎల్ రూ.1,100
10 కేఎల్ రూ.1,820


