సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా విశాఖ ఉక్కు పరిశ్రమనే నమ్ముకుని.. తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్లాంట్ అభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం ఉక్కుపాదం మోపుతోంది. ‘కాస్ట్ కటింగ్’ పేరుతో ఏకంగా 4 వేల మందిని అర్ధంతరంగా తొలగించి రోడ్డున పడేయడమే కాకుండా.. వారు తిరిగి ప్లాంట్ గడప తొక్కకుండా కట్టడి చేసేందుకు తీవ్ర చర్యలకు పాల్పడుతోంది. ఉపాధి కోల్పోయిన కార్మికులు ఇతర కాంట్రాక్టు ఏజెన్సీల్లోనైనా పని చేసుకుని కుటుంబాలను పోషించుకునే అవకాశం లేకుండా.. ప్లాంట్ గేట్‌పాస్ వ్యవస్థలో వారి ఆధార్ నంబర్లు, బయోమెట్రిక్ వివరాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ప్లాంట్‌లోని ఇతర ఏజెన్సీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా వారి ఆధార్ వివరాలు ‘బ్లాక్డ్’గా చూపుతున్నాయని చెబుతున్నాయి. ఒకవైపు స్థానిక కార్మికులను తొలగించిన యాజమాన్యం.. మరోవైపు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కొత్త కాంట్రాక్ట్ కార్మికులను తీసుకురావడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. మరోవైపు, ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ దారుణాలపై స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆధార్ కార్డూ ‘బ్లాక్’లో పెట్టేశారు
ఒక పౌరుడి ఆధార్ కార్డును రద్దు చేసే లేదా బ్లాక్ చేసే అధికారం చట్టబద్ధంగా కేవలం ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’కి మాత్రమే ఉంది. కానీ, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాజ్యాంగాన్ని, కార్మిక చట్టాలను తుంగలో తొక్కి.. తమ సొంత డేటాబేస్ (గేట్‌పాస్ సిస్టమ్)లో 4 వేల మంది ఆధార్ నంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ప్లాంట్‌లో ఉన్న దాదాపు 600 ఏజెన్సీల్లో వీరు ఎక్కడ పనికి వెళ్లినా.. ఆధార్ ఎంటర్ చేయగానే ‘బ్లాక్డ్’ అని వస్తోంది. ఉపాధి పోయినా ఇతర కాంట్రాక్టర్ల దగ్గరైనా పని చేసుకుని బతుకుదాం అనుకున్న కార్మికుల ఆశలపై యాజమాన్యం ఈ విధంగా నీళ్లు చల్లింది. ఇది ముమ్మాటికీ కార్మికుల జీవించే హక్కును హరించడమేనని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
ఉక్కు పరిశ్రమను కాపాడుతున్నామని చంద్రబా బు, పవన్‌తో సహా టీడీపీ, జనసేన నేతలు మీడి యా ముందు గొప్పలు చెబుతూ ఉద్యోగుల్ని, కార్మికుల్ని మభ్యపెడుతున్నారే తప్ప.. అక్కడ జరుగుతు న్న నిరంకుశ విధానాలపై మాత్రం స్పందించడం లేదు. 4 వేల కుటుంబాలు రోడ్డున పడి ఆకలి కేకలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు గగ్గోలు పెడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల దృష్టికి ఈ దారుణాన్ని తీసుకెళ్లినా కనీస స్పందన కరువైంది. ఉపాధికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే.. యాజమాన్యం చేస్తున్న చట్టవిరుద్ధమైన పనులకు వత్తాసు పలుకుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రానికి ఫిర్యాదు
స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథరావు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీపీజ్రామ్స్‌కు ఈ నెల 5న ఫిర్యాదు చేశారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 2024లో వేలాది కాంట్రాక్ట్ కార్మికుల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిందన్నారు. అందులో ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను స్వాధీనం చేసుకోవడం, బ్లాక్ చేయడం, స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమన్నారు. ఇది ఆధార్ చట్టం–2016ను ఉల్లంఘించడమేనన్నారు. కార్మికుడిని భవిష్యత్తు ఉపాధి నుంచి ఏకపక్షంగా నిషేధించడం ఆర్టికల్ 21 కింద ఉన్న ప్రాథమిక రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘించడమేనన్నారు. దీనిపై జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పక్క రాష్ట్రాలకు గేట్లు తీసి..
కాస్ట్ కటింగ్ పేరుతో ఒకవైపు పాత కార్మికులను తొలగించిన యాజమాన్యం.. అదే స్థానంలో తమకు అనుకూలంగా ఉండే ఇతర రాష్ట్రాల కార్మికులను దిగుమతి చేసుకుంది. ఇప్పటికే ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మందికిపైగా కొత్త కాంట్రాక్ట్ కార్మికులను రప్పించి ప్లాంట్‌లో ఉపాధి కల్పించింది. స్థానికులైతే తమ హక్కుల కోసం ప్రశ్నిస్తారని, అదే ఇతర రాష్ట్రాల వారైతే తక్కువ వేతనాలకే, ఎలాంటి సంఘాలు లేకుండా పని చేస్తారన్నదే యాజమాన్యం వ్యూహంగా స్పష్టమవుతోంది.


