మల్కాపురం: హెచ్‌పీసీఎల్‌లో సోమవారం రాత్రి భారీ మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. రాత్రి 8.30 గంటల సమయంలో ఫ్లేర్ స్టాక్ (చిమ్నీ) నుంచి సాధారణం కంటే భారీ ఎత్తున మంటలు రావడంతో మల్కాపురం, ఆర్‌కేపురం, వెంకన్నపాలెం తదితర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మంటల వెలుగుతో పరిసర ప్రాంతాలు పట్టపగల మాదిరిగా కనిపించడంతో ఏమి జరిగిందోనని స్థానికులు ఆందోళన చెందారు. హెచ్‌పీసీఎల్ పరిపాలన భవనం వెనుక భాగంలో సుమారు 120 అడుగుల ఎత్తులో రెండు ఫ్లేర్ స్టాక్‌లు ఉన్నాయి. రిఫైనరీలో ఉత్పత్తి ప్రక్రియలో విడుదలయ్యే అదనపు గ్యాస్‌లు, వ్యర్థ హైడ్రోకార్బన్‌లను భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఫ్లేర్ స్టాక్‌ల ద్వారా దహనం చేస్తుంటారు. సాధారణంగా ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో కనిపించే మంటలు సోమవారం రాత్రి సుమారు 12 అడుగుల వరకు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 1997లో జరిగిన భారీ ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగిందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రిఫైనరీలోని ఒక యూనిట్ ట్రిప్ (షట్‌డౌన్) కావడంతో ఆ యూనిట్‌లోని గ్యాస్‌లను భద్రతా నిబంధనల ప్రకారం ఫ్లేర్ స్టాక్ ద్వారా విడుదల చేయడంతో మంటలు పెద్ద ఎత్తున కనిపించాయని అధికారులు తెలిపారు. ఇది సాధారణ భద్రతా ప్రక్రియలో భాగమేనని, ఎలాంటి ప్రమాదం గానీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం గానీ లేదని స్పష్టం చేశారు. అధికారుల వివరణతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎగిసిపడుతున్న మంటలు


