ఆనందపురం: మండలంలోని తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ సోమవారం సీపీఎం నాయకులు, రైతులు ఆనందపురం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, మాజీ కార్పొరేటర్ గంగారావు, భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్.ఎస్.ఎన్.మూర్తి మాట్లాడుతూ.. గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన 520 మంది రైతులకు తక్షణమే పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు పనులను నిలిపివేయాలన్నారు. శాంతియుతంగా వెళ్తున్న తమ బైక్ తాళాలు లాక్కొని, బలవంతంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనని మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ అప్పలరాజు స్టేషన్‌కు చేరుకుని నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం నాయకులను విడుదల చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అయితే రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని నేతలు స్పష్టం చేశారు.


