విశాఖ విద్య: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 43 వినతులు అందాయి. సీతమ్మధారలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులు, డీటీఆర్ మార్పిడి, హెచ్‌ఆర్‌డీ సంబంధిత అంశాలు, రూఫ్‌టాప్ సోలార్‌కు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ ఇమ్మడి పృధ్వీతేజ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వినతులను పరిశీలించిన సంస్థ సీఎండీ తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9493681912కు చాట్ చేయడం ద్వారా కూడా తమ విద్యుత్ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని సంస్థ సూచించింది. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాశ్, ఎస్.హరిబాబు, సీజీఎం పి.సాల్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.


