బయటపడిన శ్రీరాముడి విగ్రహం
మధురవాడ: వాంబేకాలనీ వద్ద గల సుద్దగెడ్డ సమీపంలో జరుగుతున్న వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ రోడ్డు నిర్మాణ పనుల్లో శ్రీరాముడి విగ్రహం బయటపడింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలివి.. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా బయట వేసిన మట్టి కుప్ప నుంచి.. సుద్దగెడ్డ టిడ్కో హౌసింగ్‌కాలనీ వద్ద శుక్రవారం రాత్రి ఈ విగ్రహం బయటపడింది. ఆ ప్రాంతంలో పశువులు వెళ్తున్న సమయంలో మట్టి జారిపడటంతో విగ్రహం కనిపించింది. దీంతో శనివారం ఉదయం స్థానికులు ఆ విగ్రహాన్ని బయటకు తీసి, శుభ్రం చేసి పూజలు ప్రారంభించారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో ఆ ప్రాంతమంతా జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది. పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీరామచంద్రుని కృప తమపై కలిగిందని, ఇదంతా ఆ స్వామి సంకల్పమేనని స్థానికులు భావోద్వేగానికి లోనయ్యారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం తరలివచ్చి విగ్రహాన్ని దర్శించుకున్నారు.


