22–ఏ ఫైళ్లకు మోక్షమెప్పుడో?
22–ఏ అంటేనే భయపడుతున్న ఐఏఎస్ అధికారులు
కుంటి సాకులతో తిరస్కరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం
జిల్లా యంత్రాంగం వద్ద 80 వరకు ఫైళ్లు పెండింగ్
మహారాణిపేట: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. తహసీల్దార్ కార్యాలయం నుంచి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు, చివరకు కలెక్టరేట్‌లోని పలు విభాగాల్లో కూడా కొర్రీల మీద కొర్రీలు వేస్తున్నారు. అర్జీలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. రెవెన్యూ దస్త్రాల ఊసెత్తడానికే సాహసించడం లేదు. కొంతమంది ఉన్నతాధికారులు అయితే ఫైళ్ల మీద డిస్కస్ అని రాసి చేతులు దులుపుకుంటున్నారు. ముఖ్యంగా నిషేధిత జాబితా(22ఏ)లోని ఫైళ్ల విషయంలో ఈ పరిస్థితి ఉంది.
తిరస్కరణకే అధికారుల మొగ్గు
జిల్లాలో 22–ఏ జాబితాలో చేరిన భూములను, ఆ జాబితా నుంచి తొలగించేందుకు అధికారులెవరూ సాహసించడం లేదు. జిల్లాలోని ఐఏఎస్ అధికారులు సైతం 22–ఏ ఫైల్ అంటేనే వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ కేటగిరీకి సంబంధించి దాదాపు 80 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో), రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) పోస్టులు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉండటంతో కలెక్టరేట్‌లో ఫైళ్ల కదలికలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. 22–ఏ జాబితా నుంచి తమ భూములను క్లియర్ చేయించుకోవడానికి దరఖాస్తుదారులు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బాధితులు ఎక్కువగా ఒత్తిడి చేస్తే, ఏదో ఒక సాకు చూపి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. గతంలో అయితే ఫైళ్లు పెండింగ్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు 22–ఏ ఫైళ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తిరస్కరిస్తున్నట్లు సమాచారం.
ఇబ్బందుల్లో రైతులు
భూములు 22–ఏ జాబితాలో ఉండటం వల్ల అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాలు రైతులకు అందడం లేదు. ఆన్‌లైన్(1–బి)లో వివరాలు ఉంటేనే ఈ పథకాలు వర్తిస్తాయి. ఎంతోమంది రైతుల భూములను 22–ఏ లోనూ, జీరో ఖాతాల్లోనూ చేర్చారు. వాస్తవానికి హక్కులు కలిగిన రైతుల భూములను కూడా 22–ఏలో చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఎంతోకాలంగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను, హక్కులతో అనుభవిస్తున్న వారి స్థలాలను జీరో ఖాతాలకు బదిలీ చేయడం వల్ల వారు యజమాన్య హక్కులను కోల్పోతున్నారు.
జిరాయితీకి తప్పని 22–ఏ బెడద
జిరాయితీ భూములను సైతం 22–ఏ జాబితాలో చేర్చుతున్నారు. ఇది కావాలని చేస్తున్నారో లేక, ఇతర రాజకీయ కారణాల వల్ల జరుగుతోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. కొంతమంది రెవెన్యూ అధికారులు జిరాయితీ భూములను నిషేధిత జాబితాలో చేర్చుతుంటే, ఉన్నతాధికారులు సైతం ఆమోదముద్ర వేస్తున్నారు. ఒకసారి 22–ఏలో చేరిన తర్వాత, ఆ జాబితా నుంచి భూమిని బయటకు తీసుకురావడం కష్టంతో కూడుకున్న పనిగా మారింది.
అడ్డంకిగా సబ్ డివిజన్
జిల్లాలో కొన్ని సర్వే నంబర్లను మొత్తం 22–ఏలో చేర్చారు. ఈ భూములకు సబ్ డివిజన్ కాకపోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకే సర్వే నంబరులో ఉన్న వివాదాస్పద భూమి వల్ల, మిగిలిన క్లియర్ భూములు కూడా 22–ఏలో మగ్గుతున్నాయి. సదరు సర్వే నంబర్లకు సబ్ డివిజన్ చేస్తే ఎంతోమంది ఈ సమస్య నుంచి బయటపడతారు. కానీ అధికారులు సబ్ డివిజన్ చేయడానికి సహకరించడం లేదు. దీనివల్ల ఎంతోమంది ఇళ్లు కట్టుకుని కూడా, రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ అక్కడే నివసిస్తున్నారు.


