ప్రజా ఉద్యమకారులపై పీడీ యాక్టా?
డాబాగార్డెన్స్: బల్క్ డ్రగ్ పరిశ్రమ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని పోరాడుతున్న సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. దీనికి నిరసనగా సీపీఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జగదాంబ జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు కొత్తపల్లి లోకనాథం, సీహెచ్ నరసింగరావు, జగ్గునాయుడు మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై స్మగ్లర్లకు, నేరస్తులకు వేయాల్సిన పీడీ యాక్ట్‌ను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ల కోసం ఉద్యమాలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. అప్పలరాజును వెంటనే భేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు ఆర్‌కేఎస్‌వీ కుమార్, పి.మణి, బి.పద్మ, వి.కృష్ణారావు, ఈశ్వరమ్మ, ఎం.సుబ్బారావు, పి.పైడిరాజు, ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, యూఎస్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
అప్పలరాజు అరెస్ట్‌పై భగ్గుమన్న సీపీఎం


