అనుమానమే ఉసురు తీసింది...
భార్యను కడతేర్చిన భర్త అరెస్టు
యలమంచిలి రూరల్ : యలమంచిలి ధర్మవరం సీపీ పేటలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు చెప్పారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు. ఆయన మాటల్లోనే..ఉత్తరప్రదేశ్ కబీర్‌నగర్ జిల్లా నందాపూర్ గ్రామానికి చెందిన రాకేష్(27), మాయ(32) పదేళ్ల కితం ప్రేమవివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం పరవాడ,యలమంచిలి ప్రాంతాల్లో నివసించేవారు.ఇటీవల రెండు నెలల క్రితం యలమంచిలిలో సొంతంగా తుక్కు దుకాణం అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలతో పాటు 4 నెలల చిన్నారి పరితో కలిసి పట్టణంలోని ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య తరచూ ఎవరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్టు గమనించిన రాకేష్,ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానపడ్డాడు.ఈ విషయమై పలుమార్లు ఆమెను మందలించాడు. నెలరోజులుగా భార్యాభర్తల మధ్య ఈ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కుమార్తె పరికి డైపర్లు అవసరమై కొని తెచ్చేందుకు తుక్కు దుకాణంలో భార్యను ఉంచి బయటకు వెళ్లాడు రాకేష్. పని పూర్తి చేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చేసరికి భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం పసిగట్టి ఆమెను నిలదీశాడు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కోపంతో రగిలిపోయిన రాకేష్ నియంత్రణ కోల్పోయి ఆమెను గోడకు గుద్దించి, విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత కోపంతో అక్కడున్న స్క్రూడ్రైవర్‌తో ఛాతీ పై పలుమార్లు పొడిచి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన ఆమె స్పృహ కోల్పోవడంతో తుక్కు దుకాణం యజమాని సాయంతో తొలుత స్థానిక కమలా ఆస్పత్రికి, అక్కడ్నుంచి యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మాయ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించడంతో నిందితుడు రాకేష్ జరిగిన విషయం చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు స్వయంగా నేరం అంగీకరించినట్టు సీఐ తెలిపారు. మృతురాలు ఎవరితో మాట్లాడుతుందనేది నిందితుడికి కూడా తెలియదని చెబుతున్నాడని, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో తెలుసుకోవాల్సి ఉందన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో 4 నెలల చిన్నారిని తాత్కాలికంగా జిల్లా పిల్లల సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు. మృతురాలి బంధువులు ఉత్తరప్రదేశ్ నుంచి రావాల్సి ఉందని,వారొచ్చేవరకు మాయ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రి శవాగారంలో భధ్రపరిచామన్నారు.వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు..


