
దేశ రక్షణలో తెలుగు బిడ్డ సాహసం
కీర్తి చక్ర గ్రహీత మేజర్ రామ్ గోపాల్ నాయుడుకు ఘన సన్మానం
పీఎంపాలెం: దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన మేజర్ రామ్ గోపాల్ నాయుడు యువతకు ఆదర్శనీయుడని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్ర పురస్కారం అందుకున్న మేజర్ రామ్ గోపాల్ నాయుడు దంపతులకు ఫైర్ అండ్ సేఫ్టీ, శ్రీ వృక్ష, మాలతాంబ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురువారం కారుషెడ్‌లోని శ్రీవృక్ష జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఘన సన్మానం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ రామ్ గోపాల్ నాయుడు చేసిన సాహసానికి యావత్ దేశం ఫిదా అయిందని సీపీ కొనియాడారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి నిజమైన హీరోగా నిలిచాడని ప్రశంసించారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కీర్తి చక్ర పురస్కారం అందుకున్న తొలి తెలుగు వ్యక్తి మేజర్ రామ్ గోపాల్ నాయుడు అని చెప్పారు. ఈ సందర్భంగా మేజర్ రామ్ గోపాల్ నాయుడు దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి రామ్ గోపాల్ నాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పట్టుదల, నిలకడ, సహనం వంటి ఉత్తమ లక్షణాలను అలవర్చుకోవాలని హితవు పలికారు. దేశ రక్షణ బాధ్యతల్లో ఎన్నో కఠినమైన, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటామని, అయినప్పటికీ తమ లక్ష్యంపై పూర్తి దృష్టి పెడతామని చెప్పారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో తాము ఎదుర్కొన్న సాహస ఘట్టాలను ఉద్వేగభరితంగా వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఐఎఫ్‌ఎస్, మాలతాంబ విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి, శ్రీ వృక్ష విద్యాసంస్థల కరస్పాండెంట్ బి.వెంకటరమణ మూర్తి, విశ్రాంత ఎస్పీ దివాకర్, మాలతాంబ విద్యానికేతన్ జీఎం జి.పి.ఆర్.కృష్ణ, ప్రిన్సిపాల్ బి.శ్రీదేవి, మేజర్ రామ్ గోపాల్ నాయుడు కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.