
నేడు స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర
మహారాణిపేట: ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు థీమ్ అయిన ‘వర్షాకాలం పరిశుభ్రత’కు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇళ్లు, కార్యాలయాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగునీటి కాలువలను, తాగునీటి వ్యవస్థలను శుభ్రం చేయాలని ఆదేశించారు. దోమల నివారణకు ఫాగింగ్, పరిశుభ్రతపై ఇంటింటికి అవగాహన కల్పించాలని సూచించారు. అత్యంత పరిశుభ్రత పాటించిన వారికి రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛ అవార్డులు ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఉత్తమ మున్సిపాలిటీ, ఉత్తమ గ్రామ పంచాయతీ, పాఠశాల, ఆసుపత్రి వంటి విభాగాలతో పాటు స్వచ్ఛ వారియర్స్ (పట్టణాల్లో), గ్రీన్ అంబాసిడర్స్ (గ్రామీణంలో) పేరిట అవార్డులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలు, ఛాయాచిత్రాలను సాసా (ఎస్‌ఏఎస్‌ఏ) ప్లాట్‌ఫాంలో షేర్ చేయాలని అధికారులకు సూచించారు.