
అంగన్‌వాడీల బ్లాక్ డే
బీచ్‌రోడ్డు : అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్‌లు ధరించి మానవహారం నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గాంధీ విగ్రహానికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి ఎం. వెంకటలక్ష్మి మాట్లాడుతూ, వేతనాలు పెంచడం, ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా పనిభారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ సవరణ, సంక్షేమ పథకాల అమలు, యాప్‌ల సవరణ, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోషణ ట్రాకర్, బాల సంజీవిని యాప్‌లలో ‘ఫేస్ రికగ్నిషన్ సిస్టం’ తప్పనిసరి చేయడం వల్ల అంగన్‌వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. జూలై నెలలో యాప్ సమస్యలను వివరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగస్టు 4న మొబైల్స్ తిరిగి ఇచ్చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పి. శ్యామలాదేవి, ఏ. నూకరత్నం, పి. కృపారాణి, సుబ్బలక్ష్మి, రాధ, మంగ, విజయ, అన్నపూర్ణ, సంతోషి, భవాని, బీబీ రామాయమ్మ, దేవి, అరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
మర్రిపాలెం: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ అంగన్‌వాడీలు గురువారం ఆర్‌అండ్‌బి జంక్షన్ వద్ద ఉన్న ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అంగన్‌వాడీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నిరసన అనంతరం సీడీపీఓ నీలిమకు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో
నల్లరిబ్బన్లతో అంగన్‌వాడీల నిరసన