
ఇటలీలో విశాఖ యువకుడి ప్రతిభ
కొమ్మాది: తనలోని సృజనాత్మకతకు పదును పెట్టి ప్రపంచ వేదికపై తన ప్రతిభను చాటాడు. జిల్లాకు చెందిన సాగి శ్రీహరివర్మ, ఇటలీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘సిని మధమారే’ (ఇటాలియన్ ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్)లో అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా ఏడు అవార్డులను గెలుచుకుని భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు. వివిధ దేశాల నుంచి 60 మంది యువకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారతదేశం తరఫున శ్రీహరివర్మ ఒక్కడే ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇటలీలో జూలై 1 నుంచి 27వ తేదీ వరకు జరిగిన పోటీలు నిర్వహించగా..ఇటీవల విజేతలను ప్రకటించారు. శ్రీహరి నాలుగు లఘు చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాణం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. అతని ప్రతిభకు నిలువుటద్దంగా నిలిచిన ‘సిగ్నల్’, ‘గ్రాండ్ థెఫ్ట్ ఫియెట్’ లఘు చిత్రాలకు ఉత్తమ నిర్మాణ అవార్డులు దక్కాయి. అంతేకాకుండా ‘సిగ్నల్’ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు, ‘సిగ్నల్’, ‘టూరిస్ట్ ఫిలిగ్రిమేజ్’ చిత్రాలలో ఉత్తమ నటుడిగా అవార్డులను కై వసం చేసుకున్నాడు. అలాగే ‘సిగ్నల్’ చిత్రానికి ఉత్తమ సౌండ్, ‘గ్రాండ్ థెఫ్ట్ ఫియెట్’ చిత్రానికి ఉత్తమ ఎడిటింగ్ అవార్డులను కూడా సాధించాడు.
చాలా ఆనందంగా ఉంది
అంతర్జాతీయ వేదికపై ఏడు అవార్డులను గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఈ విజయంతో నా తల్లిదండ్రులు ఎస్వీఎస్‌ఎస్ రాజు, అనురాధ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ‘సిగ్నల్’ లఘు చిత్ర కథాంశంతో ఒక పూర్తిస్థాయి సినిమాను తీసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నా.. త్వరలో దానిని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాను.
– శ్రీహరివర్మ, అవార్డు గ్రహీత

ఇటలీలో విశాఖ యువకుడి ప్రతిభ