
సైబర్ సెక్యూరిటీతో బలమైన ఆంధ్రప్రదేశ్‌గా ఎదగాలి
గోపాలపట్నం : ఆంధ్రప్రదేశ్‌ను సైబర్ సెక్యూరిటీలో బలమైన రాష్ట్రంగా మార్చాలని ఎఫిసెన్స్ సిస్టమ్స్ ఫౌండర్, చైర్మన్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన ‘డిజిటల్ బ్యాక్‌బోన్ భద్రత–ఏఐ, సైబర్ రిస్కుల నేపథ్యంలో నమ్మకాన్ని పెంచడం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 700కు పైగా సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని, అయితే ఈ డిజిటల్ యుగంలో సైబర్ భద్రత చాలా అవసరమని ఆయన అన్నారు. సైబర్ దాడుల వల్ల కలిగే నష్టాలను గురించి ఆయన వివరించారు. ఈ సదస్సులో ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి సంస్థల నిపుణులు సైబర్ భద్రత, ఏఐ ఆధారిత దాడులు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అంశాలపై ప్రసంగించారు. ఓటీపీ, ఈ–కేవైసీ మోసాలను నివారించడంపైనా చర్చించారు. కార్యక్రమంలో గుంటూరు శివకుమార్, కారణ్ సజ్నాని, ద్రిజేష్ బాలకృష్ణన్, అజయ్ కులకర్ణి, సంజయ్ చిట్టోరే, సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు.