కేజీహెచ్‌లో వైద్యుల కొరత | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో వైద్యుల కొరత

Aug 22 2025 6:51 AM | Updated on Aug 22 2025 6:57 AM

● పలు విభాగాల్లో ఖాళీగా వైద్యుల పోస్టులు ● పూర్తిస్థాయిలో అందని వైద్యం ● పట్టించుకోని కూటమి సర్కార్‌

మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు వివిధ రాష్ట్రాల పేద రోగులకు వైద్య సేవలు అందిస్తున్న కింగ్‌ జార్జీ ఆస్పత్రి(కేజీహెచ్‌)లో వైద్యుల కొరత వెంటాడుతోంది. ఇటీవల వైద్యుల బదిలీల్లో కేజిహెచ్‌,ఆంధ్రా మెడికల్‌ కాలేజీ పరిధిలో పనిచేస్తున్న పలువురు వైద్యులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు బదిలీ చేశారు. ముందు చూపు లేకుండా వైద్యులను బదిలీలు చేయడం వల్ల కేజిహెచ్‌లో అనేక ప్రాఫెసర్లు,విభాగాధిపతులు,అసోసియేట్‌ ప్రొఫెసర్లు,అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యుల కొరత వల్ల అనేక అవుట్‌ పేషంట్‌(ఓపీ) విభాగాలు, శస్త్ర చికిత్సలు నిర్వహించే ఆపరేషన్‌ ఽథియేటర్లు(ఓటీ)లకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.కొంత మంది వైద్యులపై అదనపు భారం పడుతోంది.గత రెండు నెలల నుంచి జరుగుతున్న భాగోతంపై ప్రజా ప్రతినిధులు ఎవరు నోరు మోదపడం లేదు. ఉన్న వైద్యులు పని వత్తిడి కాని,ఇతర పనుల వల్ల గాని సకాలంలో విధులకు హాజరు కాలేకపోతున్నారు. కొంత మంది ఇతర పనుల వల్ల ఓపీలకు గాని, ఓటీలకు గాని సమయ పాలన పాటించడం లేదు.దీంతో వైద్య సేవల కోసం రోగులు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. రోగులకు అత్యవసర సేవలు అందడం గగనంగా మారుతోంది.

రోగులపై ప్రభావం

ఈ వైద్యుల కొరత వల్ల రోజుకు 1,400 నుంచి 2,000 మంది రోగులు వచ్చే అవుట్‌పేషెంట్‌ (ఓపీ) విభాగాల్లో, అలాగే శస్త్రచికిత్సలు జరిగే ఆపరేషన్‌ థియేటర్లలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న వైద్యులపై పనిభారం పెరగడంతో రోగులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదు.

ముఖ్యంగా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, మెడికల్‌, సర్జికల్‌ ఆంకాలజీ వంటి కీలకమైన సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కొక్క ప్రొఫెసర్‌ పోస్టు ఖాళీగా ఉండటం రోగులకు మరింత సమస్యగా మారింది. ఈ పరిస్థితి గత రెండు నెలల నుంచి కొనసాగుతున్నా, కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు.

కేజీహెచ్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 44 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి వివరాలు..

ప్రొఫెసర్లు: 1,197 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిలో, అనధికారికంగా సుమారు 2,000 మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, ప్రొఫెసర్ల పోస్టులు 11 ఖాళీగా ఉన్నాయి. నాన్‌–క్లినికల్‌ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, క్లినికల్‌ విభాగంలో 11 మంది, సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో ఐదుగురు ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అసోసియేట్‌ ప్రొఫెసర్లు: ఈ పోస్టులు ఆరు ఖాళీగా ఉన్నాయి. నాన్‌–క్లినికల్‌ విభాగంలో ఒకరు, క్లినికల్‌ విభాగంలో ఐదుగురు, సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో ఇద్దరు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: ఈ పోస్టులు 15 ఖాళీగా ఉన్నాయి. నాన్‌–క్లినికల్‌ విభాగంలో ఆరుగురు, క్లినికల్‌ విభాగంలో 15 మంది, సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో ఏడుగురు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement