
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు
అల్లిపురం: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుంది. ఏర్పాట్లను గురువారం కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు ఇది మొదటి కౌన్సిల్ సమావేశం. ఈ నేపథ్యంలో, కౌన్సిల్ హాల్‌లోని సభ్యులు కూర్చునే స్థలాలు, మైక్ సిస్టం, అధికారులు, మీడియా పాయింట్‌తోపాటు సమావేశం జరిగే విధానాన్ని కార్యదర్శి బి.వి. రమణను అడిగి తెలుసుకున్నారు. సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో పాటు సంబంధిత దస్త్రాలను కూడా సిద్ధం చేసుకోవాలని అధికారులకు తెలియజేయాలని కమిషనర్ కార్యదర్శికి సూచించారు.
24న ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
మధురవాడ: ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సాఫ్ట్‌బాల్ సబ్ జూనియర్ బాల, బాలికలు, మహిళల జట్ల ఎంపిక ఈ నెల 24న జరగనుందని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి రమణ, ఎస్.సూర్య తెలిపారు. బోయిపాలెం జంక్షన్ వద్ద ఉన్న ఈస్ట్రన్ విశాఖ ఇంగ్లిష్ మీడియం స్కూల్, కాలేజీ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్, పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రాలతో హాజరు కావాలని కోరారు. సబ్ జూనియర్స్ బాలురు, బాలికలు 2011 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని స్పష్టం చేశారు. అలాగే క్రీడాకారులు తమ సొంత కిట్‌లతో రావాలని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 98856 59016, 94900 73414 నంబర్లలో సంప్రదించవచ్చు.