
అభా‘షూ’పాలు
ఆరిలోవ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరూ సమానమని చెప్పేందుకు యూనిఫాంలు ప్రవేశపెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, ఈసారి విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకువచ్చింది. కొంతమంది విద్యార్థులకు ఒకే సైజు బూట్లు పంపిణీ చేయగా, మరికొందరికి వేర్వేరు సైజుల్లో పంపింది. దీంతో జిల్లాలోని 11 మండలాల్లో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సైజు బూట్లు అందలేదు. ఫలితంగా, విద్యార్థులు బూట్లు లేకుండానే పాఠశాలలకు వెళ్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పంపిణీ కాకుండా ఉండిపోయిన దాదాపు 3,000 జతల బూట్లను గురువారం తోటగరువు హైస్కూల్‌లో ప్రదర్శనకు పెట్టారు. అన్ని మండలాల నుంచి వచ్చిన పాఠశాల ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు అవసరమైన సైజు బూట్లను ఎంచుకుని తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఆర్జేడీ విజయభాస్కర్ సందర్శించి, ఎంఈవోలకు తగిన సూచనలిచ్చారు. అయితే ఈ మేళాలో కూడా కొందరికి సరిపడా సైజులు దొరకలేదు. వారికి కొద్ది రోజుల్లో బూట్లు పంపిణీ చేస్తామని ఆర్జేడీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీసీ చంద్రశేఖర్, సీఎంవో దేవుడు, ఎంఈవోలు రవీంద్రబాబు, అనురాధ, పలు మండలాల సీఆర్‌పీలు, పీటీలు పాల్గొన్నారు.