
భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ దేవస్థానం అధికారులకు సూచించారు. గురువారం సింహగిరిపై పర్యటించిన ఆయన భక్తులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు కలెక్టర్ ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు అందుతున్న మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, పారిశుధ్యం, ప్రసాదాల నాణ్యతను పరిశీలించారు. నిత్యాన్నదాన పథకంలో అందిస్తున్న భోజనం నాణ్యతపై పలువురు భక్తులను అడిగి తెలుసుకోగా, వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సింహగిరిపై ఎండ వేడిమి తగ్గించేందుకు అవసరమైన చోట్ల తెలుపు రంగు పూత వేయాలన్నారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రసాదాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, ముడిసరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. స్వామివారి ఆభరణాలు, వస్తువులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ స్పందిస్తూ, దేవదాయ శాఖ ఆదేశాలతో ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ జరుపుతోందని, నివేదిక వచ్చాక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని, కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన వెంట దేవస్థానం ఈఈ రమణ, ఏఈఓలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి తదితరులు ఉన్నారు.