
సాక్షి, విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా విశాఖలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు.
వివరాల ప్రకారం.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల సమావేశానికి వచ్చారు. ఈ సందర్బంగా కౌన్సిల్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేయర్ పోడియం ముందు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు సీపీఎం, సీపీఐ కార్పోరేటర్లు మద్దతు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగొచ్చిన మేయర్..
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల పోరాటానికి జీవీఎంసీ మేయర్ దిగి వచ్చారు. స్టీల్ ప్లాంట్‌పై జీవీఎంసీ కౌన్సిల్లో కీలక తీర్మానం జరిగింది. స్టీల్ ప్లాంట్‌లో తాజా పరిణామాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కౌన్సిల్. ప్లాంట్‌లో 44 విభాగాల ప్రైవేటీకరణ ప్రకటనను ఉపసంహరించాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్‌కు ముడి ఇనుము కేటాయించాలి. ఆర్ కార్డులు కలిగిన నిర్వాసితులకు ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలనీ తీర్మానం చేశారు. ఈ తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం తీసుకుంది.
