డిపాజిట్లు మళ్లించి.. ఆస్తులు కూడబెట్టి.. | - | Sakshi
Sakshi News home page

డిపాజిట్లు మళ్లించి.. ఆస్తులు కూడబెట్టి..

Dec 6 2025 7:24 AM | Updated on Dec 6 2025 7:24 AM

డిపాజిట్లు మళ్లించి.. ఆస్తులు కూడబెట్టి..

డిపాజిట్లు మళ్లించి.. ఆస్తులు కూడబెట్టి..

● డిపాజిట్లతో స్థిరాస్తుల కొనుగోలు ● బినామీల చిట్టా విప్పిన పోలీసులు ● సంస్థ ఆస్తుల అటాచ్‌కు సిఫార్సులు

‘స్నేహా’ ఆర్థిక నేరం బట్టబయలు

అల్లిపురం: ‘స్నేహా మాక్స్‌’(స్నేహా మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌), దాని అనుబంధ బినామీ సంస్థల పేరిట జరిగిన భారీ ఆర్థిక మోసాన్ని నగర పోలీసులు ఛేదించారు. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన యాజమాన్యం, ఆ నిధులను వ్యక్తిగత అవసరాలకు, బినామీ కంపెనీలకు మళ్లించి విశాఖతో పాటు ఇతర జిల్లాల్లో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను నగర శాంతిభద్రతల డీసీపీ–1 వి.మణికంఠ చందోల్‌ వెల్లడించారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిపాజిటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్నేహా మాక్స్‌, దానికి సంబంధించిన సంస్థలపై నగరంలోని దువ్వాడ, ద్వారకా, గోపాలపట్నం, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.

2014లో స్నేహా మాక్స్‌గా మార్పు

2008లో రాజేంద్రనగర్‌, సీతమ్మపేట కేంద్రంగా రిజిస్టర్‌ అయిన ఈ సొసైటీ పేరును.. సభ్యులకు తెలియకుండానే 2014లో ‘స్నేహా మాక్స్‌’గా మార్చారు. అనంతరం డిపాజిట్లను మళ్లించి స్థిరాస్తులు కొనుగోలు చేశారు. ఈ కేసులో ప్రధానంగా వ్యవస్థాపక అధ్యక్షుడు కటికల శివ భాగ్యరావు, అధ్యక్షురాలు కె.స్వర్ణలత, వారి కుమారులు కె.శ్రీకాంత్‌, కె.క్రాంతి కుమార్‌, డైరెక్టర్‌/సీఈవో ఎ.పున్నారావు, బినామీ సంస్థలైన పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్‌, యునైటెడ్‌ పబ్లికేషన్స్‌, స్నేహ ప్రియ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, అలాగే బినామీలు ఎస్‌.ధనుంజయ శరత్‌, గుమ్మడి మనోరంజన్‌ తదితరులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితులకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసి, అనంతరం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ప్రజల సొమ్ముతో రియల్‌ దందా

సబ్‌ రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి సేకరించిన పత్రాల ఆధారంగా.. డిపాజిటర్ల డబ్బు మళ్లించి కొనుగోలు చేసిన ఆస్తులను పోలీసులు గుర్తించారు. శివ భాగ్యారావు కుటుంబ సభ్యులు పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్‌ పేరిట వెంకన్నపాలెం, రాయపురాజుపేట వద్ద సుమారు 21.12 ఎకరాలు, యలమంచిలిలో దుప్పిటూరులో 0.47 ఎకరాలు, దబ్బందలో 1.50 ఎకరాలు, స్నేహ ప్రియ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేరిట షీలానగర్‌ ఎస్టీబీఎల్‌ దగ్గర 2,450 చదరపు గజాలు, యునైటెడ్‌ పబ్లికేషన్స్‌ పేరిట చిన్నవాల్తేర్‌లో అక్షయ సత్యప్రసాద్‌ విస్టాలో 2,125 చ.అడుగుల ఫ్లాట్‌(రూ.96 లక్షలు), గుమ్మడి మనోరంజన్‌ పేరిట మర్రిపాలెం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో 350 చ.గజాలు కొనుగోలు చేసి, ఇందుకోసం డిపాజిట్లు మళ్లించినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో నిందితులపై క్రిమినల్‌ చర్యలతో పాటు, ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. గుర్తించిన ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా హోల్డ్‌లో పెట్టాలని సబ్‌ రిజిస్ట్రార్లకు లేఖలు రాశామన్నారు. మిగిలిన బినామీ ఆస్తుల గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సమావేశంలో ఈస్ట్‌ సర్కిల్‌ ఏసీపీ లక్ష్మణమూర్తి, టూటౌన్‌ సీఐ వి.వి.సి.ఎం.ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement