కార్మికుల నైపుణ్యాభివృద్ధికి రూ.70 కోట్లు
మంత్రి వాసంశెట్టి సుభాష్
బీచ్‌రోడ్డు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన ఆయన పలు భవన నిర్మాణాలను పరిశీలించారు. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల భవన నిర్మాణ కార్మికుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ కోసం రూ.70 కోట్లు కేటాయించామని తెలిపారు. కార్మి కుల పనిదినాలు పెంచడం, ఆదాయం రెట్టింపు చేయడం, లేబర్ అడ్డాల ఏర్పాటు, సాంకేతిక శిక్షణ వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖలో రూ.106 కోట్ల సెస్సు రావాల్సి ఉండగా, కేవలం రూ.20 కోట్లే వసూలైనట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా రాష్ట్రంలో నిబంధనలు పాటించని సంస్థలపై ఇప్పటి వరకు 160 కేసులు పెట్టామని వివరించారు. ఏపీ బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవాల మల్లికార్జున రావు మాట్లాడుతూ కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా, అంత్యక్రియల ఖర్చులు అందేలా చూస్తామన్నారు. సాధారణ మరణానికి కూడా ఆర్థిక సాయం అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 1996 సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కార్మికులకు పని, ఆహార, ఆరోగ్య భద్రత కల్పించాలని కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. పిల్లల చదువులకు స్కాలర్‌షిప్‌లు, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు.


