డీఎల్‌డీవోనే డీడీవోగా మార్చారు
మహారాణిపేట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2023లో పాలనా వ్యవస్థలో తీసుకొచ్చిన డివిజన్ లెవెల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(డీఎల్‌డీవో) విధానాన్నే చంద్రబాబు ప్రభుత్వం డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(డీడీవో)గా మార్పు చేసిందని తప్ప ఇందులో కొత్తగా ఏమీ లేదని జెడ్పీ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జోనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు జల్లిపల్లి సుభద్ర అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎల్‌డీవోనే డీడీవో వ్యవస్థగా మార్చారే తప్ప ఇందులో కొత్తదనం గాని, విధివిధానాలు గాని, ఆర్థిక వనరుల సమకూర్చడం గాని ఏమీ లేదన్నారు. జిల్లా పరిషత్‌కు సంబంధించిన భవనాలనే వీటిని కేటాయిస్తూ జెడ్పీ నిధులనే వాటి ఆధునికీకరణకు కేటాయించడం మరీ దుర్మార్గమన్నా రు. ఇప్పటివరకు పంచాయతీరాజ్ ఉద్యోగులకు అసలు ప్రమోషన్ లేవని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పడం దుర్మార్గమన్నారు. 2023లో డీఎల్‌డీవో వ్యవస్థను తీసుకువచ్చినప్పుడే పంచాయతీ రాజ్ వ్యవస్థలో ప్రమోషన్లతోనే ప్రారంభమయ్యాయని, ప్రమోషన్లకు శ్రీకారం చుట్టిందే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని అన్నారు. డీఎల్‌డీవోగా ఎంపీడీవో స్థాయి అధికారులు మాత్రమే ప్రమోట్ చేసి ఆ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ రోజు ప్రమోషన్ల సంఖ్య పెరిగింది తప్ప.. ప్రమోషన్ అనేది కొత్తగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది కాదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు డీడీవో కార్యాలయాలు తీసుకొచ్చారని, అవన్నీ పంచాయతీ రాజ్ భవనాలని చెప్పారు.


