అనధికార నిర్మాణాలు తొలగించండి
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 వినతులు వచ్చాయని కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకరరావు, సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లోనూ, ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో అనధికార నిర్మాణాలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ స్కీంలో దరఖాస్తులు చేసుకున్న వాటిని కాకుండా మిగతా అనధికార నిర్మాణాలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. నగరంలో వాణిజ్య సముదాయాలు, దుకాణాల ప్రకటనల బోర్డుల పన్నులతో పాటు, ప్రైవేట్ ప్రకటనల ఏజెన్సీల నుంచి ప్రకటనల పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. వాహనాల రాకపోకలు, పాదాచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఫుట్‌పాత్‌లు, రోడ్డు ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అధికారుల లాగిన్‌లోకి వచ్చిన దరఖాస్తులను లాగిన్‌లో ఎక్కువ కాలం ఉండడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఫైల్స్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.


