
బెడ్ షీట్లలో భారీ అవినీతి
వివిధ రైల్వే జోన్ల పరిధిలో బెడ్ షీట్స్ కుంభకోణం
ఏసీ కోచ్ ప్రయాణికులకు బెడ్ షీట్స్ సరఫరా
ఏటా వీటిని కొనుగోలు చేస్తున్న ఆయా రైల్వే జోన్లు
ఒక్కో జోన్ పరిధిలో ఒక్కో ధరకు
బెడ్ షీట్స్ కొనుగోలు
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల రైల్వే శాఖలో అవినీతి తారస్థాయికి చేరుకుంటోంది. డీఆర్‌ఎంలు, సీనియర్ ఇంజినీర్లు వరుసగా సీబీఐ దాడుల్లో పట్టుబడుతున్న నేపథ్యంలో మరో కుంభకోణం బట్టబయలైంది. కాదేదీ కుంభకోణానికి అనర్హం అన్నట్లుగా ఏసీ కోచ్‌లలో సరఫరా చేసే బెడ్‌షీట్ల కొనుగోళ్లలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో జోన్ పరిధిలో ఒక్కో ధరకు బెడ్‌షీట్లు కొనుగోలు చెయ్యడం చూస్తుంటే భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఈ విషయంలో ముందువరసలో ఉంది. సాధారణంగా కొన్ని జోన్‌లు ఒక్కో బెడ్‌షీట్ రూ.147కి కొనుగోలు చేస్తుండగా అనేక జోన్లు మాత్రం ఏకంగా రూ.300కి పైగా కొనుగోలు చెయ్యడం వెనుక భారీ అవినీతి దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం సీబీఐ దర్యాప్తు చేపట్టినా మళ్లీ ఈ కుంభకోణం వ్యవహారం షురూ అయ్యింది. దీంతో మరోసారి సీబీఐ దీనిపై దృష్టిసారించడంతో అన్ని రైల్వే జోన్లలో ఈ బెడ్‌షీట్ల కుంభకోణం బట్టబయలయ్యే అవకాశాలు స్పష్టమవుతున్నాయి.
ఇండియన్ రైళ్లలో థర్డ్ ఏసీ, సెకెండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు బెడ్‌షీట్లు సరఫరా చేస్తుంటారు. ఈ బెడ్‌షీట్లను అన్ని జోన్లు దాదాపు ఒకే దగ్గర కొనుగోలు చేస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం ఓ రైలులో బెడ్‌షీట్లు నాసిరకంవి సరఫరా చేసినట్లు ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆరాతీసిన రైల్వే బోర్డు ఉన్నతాధికారులకు దిమ్మతిరిగే షాక్ కలిగింది. ఈ బెడ్‌షీట్ల కొనుగోలు వెనుక భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. సుమారు అన్ని జోన్లలోనూ ఇదే తరహా వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నాసిరకం బెడ్‌షీట్లపై దర్యాప్తు చెయ్యగా దాని వెనుక ఉన్న బండారాన్ని బయటకు లాగే పనిలో సీబీఐ అధికారులు మరోసారి నిమగ్నమైనట్లు సమాచారం. 2023 నుంచి ఈ కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి రాజ్యమేలుతున్నట్లు గుర్తించారు.