
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని విలువైన స్థలాలను కారుచౌకగా అనుయాయులకు అప్పగిస్తున్న కూటమి ప్రభుత్వం, తాజాగా తన తోకపత్రిక ఆంధ్రజ్యోతికి అర ఎకరం హౌసింగ్ బోర్డు స్థలం విశాఖ నగరపాలక సంఘం ద్వారా కేటాయించాలన్న ప్రయత్నం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కోట్లాది రూపాయల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి నామమాత్రపు ధరకు ఎలా కేటాయిస్తారంటూ శుక్రవారం కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించడంతో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే, పరదేశీపాలెంలోని సర్వే నెంబరు 203/2పీలోని అర ఎకరం స్థలం కేటాయింపు అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చింది. నిజానికి రెగ్యులర్ అజెండాను నాలుగైదు రోజులు ముందుగానే కార్పొరేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కేటాయింపును రెగ్యులర్ అజెండాలో చేర్చకుండా టేబుల్ అజెండాగా, అదీ చివరి 67వ అంశంగా ఆఖరు నిమిషంలో కౌన్సిల్ ముందుకు తెచ్చారు.
అనంతరం టేబుల్ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. చివరి నిమిషంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు 67 వ అంశాన్ని తిరిగి ప్రస్తావించారు. ఇంతటి కీలక అంశాన్ని టేబుల్ అజెండాగా చేర్చి, ఎలా ఆమోదింపజేస్తారంటూ గట్టిగా నిలదీశారు. దీనితో తప్పనిసరి పరిస్థితిల్లో 67వ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. కాగా, ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో ఎకరా ధర దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా.

గతంలోనూ కారుచౌకగా కేటాయింపు, రద్దు చేసిన వైఎస్సార్‌సీపీ..
వాస్తవానికి 2017లో ఇదే ప్రాంతంలో రూ.7.26 కోట్లు విలువ చేసే స్థలాన్ని రూ.50.50 లక్షలకే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్, ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయించింది. ఆ కేటాయింపును గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసి, ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది. ఇప్పుడు బాబు ప్రభుత్వం మరోసారి అదే సంస్థకు భూమిని అతి తక్కువ ధరకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.