
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు కానీ.. చర్యలు మాత్రం ఉండవా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దోపిడీలు దౌర్జన్యాలు భూ కబ్జాలు పెరిగిపోయాయి.అర్హత కలిగిన వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారు. వికలాంగులను తీసుకొని కలెక్టర్లను కలుస్తాం. ఈనెల 30 లోపు సమస్య పరిష్కరించాలి. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. దివ్యాంగుల తరఫున కూడా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి. vదేశంలో ఎక్కడా లేనివిధంగా ఎందుకు జరుగుతుంది. ఈనెల 30 తేదీన విశాఖలో జరిగే జనసేన సమావేశంలో స్టీల్ ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్ తన వైఖరి చెప్పాలి. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గిన్నిస్ బుక్ గురించి ఆలోచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు, పవన్‌కు ప్రధానిని అడిగే బాధ్యత లేదా?. రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. స్టీల్ ప్లాంట్‌పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్తాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలతో కలిసి వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు సంఖ్య బలం ఉన్నపుడు పోటీ పెట్టడానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం. ప్రణబ్ ముఖర్జీ, రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, కోడెల శివ ప్రసాద్ ఎన్నికకు మద్దతు తెలిపాం. ఇండియా కూటమి అభ్యర్థి జడ్జిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు సైకిల్ సింబల్ వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. చంద్రబాబు ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్టు చేస్తారా? అని ప్రశ్నించారు.