మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే: బొత్స | YSRCP Botsa Satyanarayana Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే: బొత్స

Jul 12 2025 11:45 AM | Updated on Jul 12 2025 11:52 AM

YSRCP Botsa Satyanarayana Serious Comments On CBN Govt

సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ఏడాది పాలనలో ఏ రంగం చూసినా ఆరాచకం, అల్లకల్లోలమే మిగిలిందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రైతులను కించపరిచేలా ప్రభుత్వం పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవకాశం ఉంది కదా అని కూటమి నేతలు అన్నీ దోచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. డ్రగ్స్‌లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు అంటూ మండిపడ్డారు.

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఏ వర్గం సంతృప్తిగా లేదు. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టం ఆవిరి అయిపోతుంది. రైతులకు ప్రభుత్వం సాయం అందడం లేదు. రైతులను కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే. మిర్చి, పొగాకు, ఆక్వా ఏ రంగం తీసుకున్నా ఇదే పరిస్థితి. వైఎస్‌ జగన్‌ రైతుల గురించి మాట్లాడితేనే వాళ్ల బాధలు తెలుస్తాయి. ప్రభుత్వం స్పందించే నాటికి పుణ్యకాలం గడిచిపోతోంది. ఎక్కడికక్కడ దోపిడీ నడుస్తోంది.

మంత్రుల దోపిడీ..
వైఎస్‌ జగన్ చిత్తూరు వెళ్ళాక కూటమి నేతలకు ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన వచ్చింది. సీజన్ అయ్యాక పర్యటన ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. అంతా అయిపోతే ఇప్పుడు మీరెందుకు ఢిల్లీ వెళ్లారు. పొగాకు రైతులకు కూడా ఇదే అన్యాయం జరిగింది. మిర్చి రైతుల సమస్య అంశంలో కూడా ఇదే జరిగింది. ఈ ప్రభుత్వంలో అంతా దోపిడీనే.. మంత్రుల అవినీతి ఎక్కువైందని చంద్రబాబు అన్నారు. వారి అనుకూల పత్రికలు కూడా అవే వార్తలు రాశాయి. రాజు ఎలాంటి వాడు అయితే మంత్రులు కూడా అలాగే ఉంటారు. ప్రభుత్వంలో మంత్రుల తీరు, పాలనను ఆక్షేపిస్తున్నాను. చంద్రబాబు సరిగ్గా ఉంటే అందరూ బాగుంటారు..

డ్రగ్స్‌ సిటీగా విశాఖ..
గంజాయిని అరికడతాం అని ప్రగల్భాలు పలికారు. గంజాయి పోయి ఇప్పుడు విశాఖలోకి డ్రగ్స్ వచ్చాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు ఒక్కో రోజు ఒక్కో స్టేట్‌మెంట్ ఇచ్చారు. డ్రగ్స్‌లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు. అభివృద్ధిలో విశాఖను ఏమీ చేయలేకపోయారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. యోగాంధ్ర వలన విశాఖకు ఉపయోగం ఏమిటి?. విశాఖలో జరుగుతున్న భూ బాగోతంపై సీఎం, గవర్నర్‌కు లేఖ రాస్తాను. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు. ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుంది. ఇష్టారీతిన అప్పులు చేశారు. మీరు జగన్ ఇచ్చినట్టు ప్రజలకు ఏమైనా ఇచ్చారా?. ఏపీలో ప్రభుత్వ తీరు మాటలు గొప్ప ఊరు దిబ్బలా ఉంది. రాష్ట్రానికి పన్నుల రాబడి ఎందుకు తగ్గింది?. ప్రజల్లో కొనుగోలు శక్తి లేక ఆదాయం తగ్గుతోంది.

సింగయ్య మృతి ఘటనలో కూడా పోలీసులపై ఒత్తిడి చేసి మరి స్టేట్‌మెంట్ ఇప్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై అకృత్యాలు పెరిగాయి. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవం పోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏపీఎండీసీ నుంచి తెచ్చిన రుణాల అవకతవకలపై మాట్లాడుతాను. తప్పులను ఎత్తి చూపుతాం. విశాఖలో పార్కులు కబ్జా చేస్తున్నారు. ఇష్టానుసారంగా టీడీఆర్ కుంభకోణాలకు తెర తీశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో తప్పులు జరిగాయని మాటలు చెప్పారు. ఆ మాటలపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.

కూటమి నేతల దోపిడీ, ఆరాచకం..
సంవత్సర కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో ప్రజలకు వివరిస్తా. నాడు-నేడు స్కీం ఆపడం మంచిది కాదు. అనకాపల్లిలో లిక్కర్ మాఫియా బయట పడింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో లిక్కర్ మాఫియా నడుస్తోంది. ఎవరి పని వారిని చేసుకోనిస్తే ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో అధికారులకు స్వతంత్రం లేదు. సామాన్యుడికి ఐదు వెళ్ళు నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. కూటమి నేతల దోపిడీ, ఆరాచకాలను ఎందుకు అరికట్టడం లేదు. సంవత్సరంలోనే ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు. కూటమి హామీలు విని ప్రజలు మోసపోయారు. కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ఫీడ్ బ్యాక్ తెప్పించుకోండి. మాట ఇచ్చాం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. ఇంతటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement