
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు.
పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని.. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్సార్‌పీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు.
మెడికల్ కాలేజీలప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని బొత్స అన్నారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ భయపడదు. కూటమి పాలనలో పంటల సాగు తగ్గిపోయింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఎప్పుడూ యూరియా సమస్య రాలేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలుపడుతున్నారు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
‘‘దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు వారికి కట్టబెట్టడం దుర్మార్గం. చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేట్ మనిషే.. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చేశారు. కట్టిన కాలేజీలను కూడా ప్రైవేట్‌కు ఇవ్వడం.. మెడికల్ సీట్లు తిరస్కరించిన ప్రభుత్వం ఇదే. పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్సార్.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు.
..చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. నిధులు విడుదల చేయకపోవడంతో నెట్‌వర్క్ ఆసుప్రతుల్లో పేద వాడికి వైద్యం అందడం లేదు. రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో రూ. 6 వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి వెచ్చించలేరా?. యూరియా సమస్య కోసం మాట్లాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. యూరియా సమస్య ఎందుకు వచ్చిందని సీఎం ఆలోచన చేయాలి. అది మానేసి తిరిగి అడిగిన వారిపై చర్యలు తీసుంటారట. ఎవరి మీద చర్యలు తీసుకుంటావ్?
..మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. యూరియా కోసం లైన్‌లో నిలబడితే బఫె భోజనంతో పోల్చుతున్నారు. మీ మాటలు ప్రజలు గమనిస్తున్నారు. యూరియా సమస్యకు పరిష్కారం చూపించండి. 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటికే నెల రోజులుగా సమస్య చూస్తున్నాం. యూరియా వినియోగం, డిమాండ్, అందుబాటులో ఉన్న లెక్కలపై స్పష్టత ఇవ్వండి. రైతులకు భరోసా ఇవ్వండి. అది మానేసి ఎదురుదాడి చేయడం ఏంటి..?

..అడిగితే జైల్లో పెడతాం అంటున్నారు.. రేపనే రోజు ఉండదా..?. తప్పు చేసిన వారిని క్షమించాల్సిన పనిలేదు. రుషికొండ భవనాల్లో నిజంగా పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. రుషికొండ కాంట్రాక్టర్‌కు డబ్బులు ఎవరు ఇచ్చారు?. సంపద సృష్టి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా..?. ఏ కాలేజీ ఎవరికీ ఇవ్వాలని అనుకున్నారో పేర్లతో సహా త్వరలో చెప్తా. దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా?. ఇక్కడే ఎందుకు వస్తుంది..?. ఏపీలో కూడా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే కదా ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారు. ఎందుకు యూరియా అందుబాటులో లేదు..
..స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం నిర్వాకం వలన పోరాటం తప్పడం లేదు. ప్లాంట్ రక్షణ కోసం గత్యంతరం లేక ప్రజా సంఘాలతో పోరాటం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రధాని, లేదా ఉక్కు మంత్రితో చెప్పించండి. మీకు జై కొడతాం.. పార్లమెంట్‌లో అయినా చెప్పించండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అందరి సమస్య. ఈనెల 12న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు.. నేను వెళ్తున్నా.. టీడీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రైవేటీకరణ జరగదని చెప్పాలి. ప్రభుత్వ నియంత నిర్ణయాలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’’ అని బొత్స చెప్పారు.
అశోక్ గజపతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ..
రుషికొండ భవనాలపై అశోక్ గజపతి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇస్తూ.. రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారంటే.. అశోక్ గజపతి రాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్ధమవుతుందన్నారు. అలాంటి వాళ్లను మెంటల్ హాస్పటల్ లో పెట్టాలన్న బొత్స.. ఆయనకు అహంకారం పుట్టుకతో వచ్చిందన్నారు.