
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాకర్టీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో, స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపైకి స్థానికులు తిరగబడ్డారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు తెలుపుతూ ఖర్చీలను విసిరేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇదిలా ఉండగా.. విశాఖలోని పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికంగా ఉన్న 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే, ముందస్తుగా పోలీసులతో బందోబస్తు (arrangement)ను ఏర్పాటు చేసినప్పటికీ.. నిరసన కారులతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానికులు. సిమెంట్ కంపెనీతో జనావాసాలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళన దిగారు. గోబ్యాక్ అంబుజా సిమెంట్ (Ambuja Cement) అంటూ నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల వారిని అదుపు చేసే ప్రయత్నం చేయడంతో.. ఆగ్రహించిన స్థానికులు మీటింగ్ స్థలంలో ఉన్న కూర్చీలను విసిరేశారు.
