
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులకు ఇస్తున్న ప్యాకేజీ బాగుందా? లేక పంజాబ్‌లో ఇటీవల ప్రకటించింది మెరుగ్గా ఉందా?. అమరావతి రైతులు ఈ విషయంపై కొంత విశ్లేషణ చేసుకోవడం మేలు. పంజాబ్ ప్రభుత్వం గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగం కోసం ఇటీవలే 21 ప్రాంతాల్లో సుమారు 65 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. పరిహారం కోసం ముందుగా ఒక ప్యాకేజీ ప్రకటించింది కానీ విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సవరించాల్సి వచ్చింది.
కొత్త ప్యాకేజీతో పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కొన్నిచోట్ల మాత్రం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు పంజాబ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇస్తే ఎకరా భూమికి 800 గజాల ప్లాట్ కేటాయించారు. పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తే వెయ్యి గజాల పారిశ్రామిక ఫ్లాట్, 300 గజాల నివాస ప్రాంతం, వంద గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.30 వేల కౌలు ముందు ప్రకటించారు. వ్యతిరేకతతో దీన్ని రూ.50 వేలకు పెంచారు. సేకరించిన భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భూమి అభివృద్దిలో ఆలస్యం జరిగితే కౌలు మొత్తాన్ని ఏడాదికి పది శాతం చొప్పున పెంచుతారు. సేకరించిన భూమి సెంట్లలో మాత్రమే ఉన్నా వారికి కూడా వాణిజ్య ప్లాట్లు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.
అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీని పంజాబ్‌తో పోల్చి చూస్తే ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత కౌలు మొత్తం రూ.లక్ష చెల్లించే అంశం ఉన్నట్లు లేదు. ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి చేపట్టేలోగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆ భూములలో పట్టణాభివృద్ధి పనులు ఆరంభం అయ్యే వరకు రైతులు వ్యవసాయం కొనసాగించుకోవచ్చు. ఏపీలో అసలు అభివృద్ది పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాలలో గట్లను తొలగించి, రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ కంప కొట్టడానికి ఏపీ ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది.
మరోవైపు రైతులు స్వచ్చందంగా ఇస్తేనే భూమి తీసుకుంటామని, బలవంతంగా సమీకరించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పడం విశేషం. అయినప్పటికీ అక్కడి విపక్షం రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమును ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని చేసిన హామీ మాటేమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవంత్ సింగ్ మాన్ కొట్టిపారేసి, రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారు. ఈ రకంగా ఆలోచిస్తే ఏపీలో ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ సిక్స్‌లో ఒకటి అర హామీలు మాత్రమే అమలు చేసింది. అమలు చేయని వాటిలో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి సేకరణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకుని, అమరావతి సెంటిమెంట్‌ను ప్రయోగించి విపక్ష గొంతు నొక్కి అయినా తాను అనుకున్న విధంగా లక్ష ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కాని, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. ప్రభుత్వం సకాలంలో భూమిని అభివృద్ధి చేసి వారికి ప్లాట్లు ఇస్తే, వాటికి మంచి ధర పలికితేనే రైతులకు, లేదా భూమి సొంతదారులకు ఉపయోగం ఉండవచ్చు. కానీ, ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ది చేయలేకపోవడం, ఓవరాల్‌గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా కొంత మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్‌ను ప్రభావితం చేశాయి. దాంతో అమరావతి గ్రామాలలో కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం ఉంది. ధరలు కూడా గతంలో ఉన్న స్థాయిలో లేవని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా బలంతో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పిస్తుంటారు. కొన్నిసార్లు ఆ వ్యూహం సక్సెస్ అయినా, ఎక్కువ సార్లు విఫలమవుతుంటుంది. అప్పుడు దానిని వదలిపెట్టి కొత్తదేదో చేపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొలుత అమరావతి రాజధాని నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేయడంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూములు కొన్నవారు అప్పట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, అంతర్గత సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాజధానిగా పరిగణిస్తున్న గ్రామాలలో టీడీపీ నేతలు పలువురు భూములు కొని లాభపడ్డారని చెబుతారు. కానీ, అది కూడా తాత్కాలికమే అయింది. రైతుల వద్ద కాస్త అధిక ధరకు కొనుగోలు చేసి, అంతకన్నా ఎక్కువకు అమ్ముకున్న వారు లాభపడ్డారు. కానీ, ఇంకా బాగా లాభాలు వస్తాయన్న భావనతో ఉన్నవారు మాత్రం కొంతమేర నష్టాల పాలయ్యారు.
2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఎన్నికలలో కూడా ఆ పాయింట్ ఆధారంగా లబ్ది పొందే యత్నం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల రేట్లు కృత్రిమంగా పెంచడం కోసం టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనబడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44వేల ఎకరాల భూమి సేకరించబోతుందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్‌సెట్ అయ్యారు. ప్రభుత్వం ముందు రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలు అభివృద్ది చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కాని, అదేమీ చేయకుండా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.
రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికి అందలేదు. ఎకరాకు 1200 గజాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదట. నెల రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగం మరీ కుదేలైందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్లను అన్ని సదుపాయాలతో అభివృద్ది చేయాలి. ఆ పని ఇంతవరకు మొదలే కాలేదు. రైతులు ఎక్కడ భూమి ఇస్తారో, అక్కడే ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక గ్రామంలో ఒక సంస్థకు భూమి కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేకుండా రైతులు అడ్డుకున్నారట.

మరోవైపు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, ఆదాని క్రీడా నగరమని, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను పతాక శీర్షికలుగా వండి వారుస్తోంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.31 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం టెండర్లు మాత్రం రూ.ఏభై వేల కోట్లకు పైగానే పిలిచిందట. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్లు పట్టవచ్చని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఎంతమేర పుంజుకుంటుందో చెప్పలేం. వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త సంస్థలు వస్తే కొంత అభివృద్ది ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితి అంత అనువుగా లేదు.
ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో సాగడం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇంకో మాట చెప్పాలి. విశాఖ వంటి నగరంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఎకరా ఇరవై కోట్లకు పైగానే అమ్ముడు పోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగితే ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.
అమరావతి ద్వారా సంపద సృష్టి ఎప్పటి నుంచి మొదలు అవుతుందని ఒక విలేకరి చంద్రబాబును అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, మూడేళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుందని జవాబు ఇచ్చారు. ఒకప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ నగరం అని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం కోరుకున్న రీతిలో సాగడం లేదు. ఈ వ్యాపారం సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్‌లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదేమో ఆలోచించాలి.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.