
ఉక్కుకార్మికుల పోరాటానికి వైఎస్సార్‌సీపీ మద్దతు
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
మహారాణిపేట: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు హామీ ఇచ్చారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరుతూ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కె.కె.రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డిలకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రైవేటీకరణను అడ్డుకున్నారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 32 విభాగాలకు నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో కార్మికులకు అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, కార్మిక సంఘాలతో కలిసి ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో వైఎస్సార్ సీపీ తరఫున ఉద్యమిస్తామని కె.కె.రాజు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కర్రినాయుడు, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, వైఎస్సార్ స్టీల్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ యూనియన్ నాయకులు, ట్రేడ్ యూనియన్ జోనల్ విభాగ అధ్యక్షుడు పీవీ సురేష్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాయపురెడ్డి అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ చెన్నా జానకిరామ్, ప్రధాన కార్యదర్శి అల్లు శంకరరావు, ద్రోణం రాజు శ్రీవత్సవ పాల్గొన్నారు.