
అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత
మహారాణిపేట: ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో రెవెన్యూ విభాగానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ సోమవారం పీజీఆర్‌ఎస్‌కు తక్కువ ఫిర్యాదులు వస్తాయనుకున్నారు. వచ్చిన 173 ఫిర్యాదుల్లో 66 రెవెన్యూశాఖకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. పోలీస్ శాఖకు సంబంధించి 10, జీవీఎంసీవి 50 ఉన్నాయి. ఇతర విభాగాలకు సంబంధించి 47 వినతులు వచ్చాయి.
24 గంటల్లో వినతులు పరిష్కరించాలి
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి, పునరావృతం కాకుండా సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. తన కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యను తెలుసుకుని, పరిష్కారానికి భరోసానిచ్చారు. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయరెడ్డి వినతులు స్వీకరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.