అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Aug 26 2023 1:14 AM | Updated on Aug 26 2023 8:00 AM

- - Sakshi

విశాఖపట్నం: అప్పులు తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం గొరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లిదండ్రులు మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తుల కథనం ప్రకారం...గొరపల్లిలో కల్లూరు సత్యనారాయణ (57) కిరణా దుకాణం నడుపుతున్నాడు. అతనికి భార్య సూర్యకుమారి (48), కుమారుడు సంతోష్‌ (26), కుమార్తె నీలిమ (24) ఉన్నారు. కుమారుడు సంతోష్‌ ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. కుమార్తె నీలిమ డిగ్రీ చదివి ఇంట్లోనే ఉంటోంది.

సత్యనారాయణ, సంతోష్‌ ఇటీవల అప్పులు చేశారు. అప్పలు తీర్చమని ఫైనాన్స్‌ వాళ్లు సత్యనారాయణ ఇంటికి వచ్చి డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో మనస్థాపానికి గురైన సత్యనారాయణ, సూర్యకుమారి, నీలిమ గురువారం అర్ధరాత్రి దాటాకా పురుగు మందు తాగారు. ఈ విషయాన్ని సూర్యకుమారి అదే గ్రామంలో ఉంటున్న బంధువుకి ఫోన్‌చేసి చెప్పింది. దాంతో సూర్యకుమారి బంధువు, గ్రామస్తులు సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు.

ఆ సమయంలో సంతోష్‌ ఇంట్లో లేకపోవంతో అతనికి సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న సంతోష్‌, బంధువులు, స్థానికులు కలిసి వారిని కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం సత్యనారాయణ, మధ్యాహ్నం సూర్యకుమారి మృతి చెందారు. నీలిమ పరిస్థితి విషమంగా ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. పెందుర్తి సీఐ ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రూ.25 లక్షల వరకు అప్పులున్నట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement