దాహం తీరేనా? | - | Sakshi
Sakshi News home page

దాహం తీరేనా?

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

కదిలిన జీవీఎంసీ యంత్రాంగం

సాక్షి కథనానికి అధికారుల స్పందన

వేకువజాము నుంచే క్షేత్రస్థాయిలో

నీటి సరఫరాపై పర్యవేక్షణ

ఎద్దడి ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

డాబాగార్డెన్స్‌: నగరంలో తాగునీటి ఎద్దడిపై ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. ‘మహానగరం.. దాహం.. దాహం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జీవీఎంసీ అధికారులు స్పందించారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశాలతో అధికారులు ఆదివారం వేకువజాము నుంచే క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ, చీఫ్‌ ఇంజినీర్‌ పీవీవీ సత్యనారాయణరాజు, తూర్పు జోన్‌ జోనల్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ పల్లంరాజుతో పాటు సంబంధిత ఈఈలు, డీఈఈలు, ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి, సమస్య ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టారు.

ఆరిలోవకు ట్యాంకర్ల ద్వారా నీరు

ముడసర్లోవ వాటర్‌ వర్క్స్‌ నుంచి జీవీఎంసీ, ప్రైవేట్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి ఆరిలోవతో పాటు అవసరమైన ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అలాగే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ‘డయల్‌ ఏ ట్యాంకర్‌’ సేవతో పాటు ఆన్‌లైన్‌లో ట్యాంకర్లను బుక్‌ చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత ప్రాంతాలకు ట్యాంకర్లను పంపిస్తున్నారు.

ఎత్తయిన ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి

అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ, తూర్పు జోన్‌ జోనల్‌ కమిషనర్‌ శివప్రసాద్‌ తదితర అధికారులు ఆదివారం కై లాసనగర్‌, శ్రీహరినగర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరాను పరిశీలించారు. ఎత్తయిన ప్రాంతాల్లోనూ తగిన ఒత్తిడితో నీరు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. నీటి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి, వృథాను నివారిస్తూ జీవీఎంసీకి సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement