ఇదేం దోపిడీ ఆచార్యా..! | - | Sakshi
Sakshi News home page

ఇదేం దోపిడీ ఆచార్యా..!

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

ఏయూలో ..నీకింత.. నాకింత

బోధన పేరుతో దొంగ బిల్లుల దందా..

రూ.లక్షల్లో వర్సిటీ ఆదాయానికి గండి

కొందరు ఆచార్యుల చేతివాటం..

ప్రశ్నిస్తే ఏకంగా వీసీకే ధమ్కీ

పీహెచ్‌డీ స్కాలర్ల భవిష్యత్తుతో ఆటలు

అన్యాయంపై విచారణకు డిమాండ్‌

విశాఖవిద్య: అవకాశం ఇవ్వాలే కానీ మొత్తం పిండేస్తాం అన్నట్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు ఆచార్యులు అడ్డగోలుగా వర్సిటీ సొమ్ము దోచేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన పేరుతో రీసెర్చ్‌ స్కాలర్స్‌ను అడ్డంగా వాడుకుంటున్న వ్యవహారం ప్రస్తుతం వర్సిటీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏయూ నిధులను అడ్డదారిలో మళ్లించేందుకు లక్షల విలువైన దొంగ బిల్లులను వైస్‌ చాన్సలర్‌ టేబుల్‌ వద్దకు చేర్చినట్లు ప్రచారం సాగుతోంది. పలు విభాగాల్లో పీహెచ్‌డీ స్కాలర్లను టెంపరరీ టీచింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ కింద పనిచేస్తున్నట్లు చూపించి ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

అడ్డగోలు దోపిడీ ఇలా... : సాధారణంగా ఏయూలో పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి టీటీఏలుగా అవకాశం కల్పించి విద్యార్థులకు బోధన చేయిస్తారు. వీరికి సెమిస్టర్‌ చొప్పున ఏయూ రూ.లక్షల్లో ఫీజు చెల్లిస్తుంది. అయితే పీహెచ్‌డీ స్కాలర్స్‌తో ఉచితంగా టీచింగ్‌ సేవలు వినియోగించుకోవాలని యూజీసీ నిబంధన ఉంది. దానికి అనుగుణంగా వైస్‌ చాన్సలర్లు ప్రొసీడింగ్స్‌ ఇస్తుంటారు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని కొందరు విభాగాధిపతులు స్కాలర్లతో ఉచితంగా పాఠాలు చెప్పిస్తూ, వారిని టీటీఏలుగా చూపుతూ దొంగ బిల్లులు పెట్టి వర్సిటీ సొమ్ము దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పీహెచ్‌డీ పూర్తి చేసి ఉద్యోగం లేని వారికి టీటీఏలుగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. కానీ కొందరు విభాగాధిపతులు వర్సిటీ యాజమాన్య మెతక వైఖరిని అవకాశంగా తీసుకుని, స్కాలర్లనే టీటీఏలుగా చూపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

వైస్‌ చాన్సలర్‌ కళ్లుగప్పి : ఈ దొంగ బిల్లుల వ్యవహారమంతా వైస్‌ చాన్సలర్‌ కళ్లుగప్పి నడుస్తున్నట్లు ఏయూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీసీ పర్యవేక్షణ లోపాన్ని అదునుగా చేసుకుని కొందరు ఆచార్యులు ఈ కక్కుర్తికి పాల్పడుతున్నట్లు సమాచారం. పీహెచ్‌డీ స్కాలర్లకు జరుగుతున్న అన్యాయంపై వైస్‌ చాన్సలర్‌కు ఫిర్యాదు వెళ్లడంతో, ఆయన విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి ఆరా తీశారు. డిపార్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ కమిటీ దృష్టికి ఈ విషయాలను తీసుకువచ్చారా లేదా అని ప్రశ్నించారు. అయితే అప్పటికప్పుడు వీసీని నమ్మించి, డీఆర్‌సీ రికార్డుల్లో తప్పుడు నమోదులు చేసేందుకు కూడా కొందరు దారులు వెతుక్కుంటున్నట్లు సమాచారం. ఇలా పరిపాలన రంగాన్ని మోసం చేస్తూ లక్షలాది రూపాయల దొంగ బిల్లులను పంపగా, అవన్నీ ప్రస్తుతం వీసీ సంతకం కోసం ఎదురుచూస్తున్నాయి.

సమగ్ర విచారణ జరపాలి:

ఉద్యోగ సంఘాలు

పవిత్రమైన ఆచార్య వృత్తిలో ఉండి కాసులకు కక్కుర్తి పడుతూ, స్కాలర్లను వాడుకుంటూ దొంగ బిల్లులతో వర్సిటీ ఆదాయానికి గండికొడుతున్న విభాగాధిపతులపై తక్షణమే విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు, మేధావులు డిమాండ్‌ చేస్తున్నారు. పీహెచ్‌డీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి అవకాశం దక్కకుండా చేస్తున్న ఇటువంటి పరిస్థితుల నుంచి వర్సిటీని కాపాడాలని కోరుతున్నారు. వర్సిటీ పాలనపై వీసీ పూర్తిస్థాయి దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement