సాక్షి, విశాఖపట్నం: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిరుద్యోగుల హక్కుల సాధన కోసం చేపడుతున్న శాంతియుత నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును అణచివేయడం సరికాదని విమర్శించారు. యువత, నిరసనకారులపై విధించిన పోలీసు ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే నెరవేర్చాలని, బాధ్యతాయుత ప్రతిపక్షంగా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.


