నిషేధిత భూముల జాబితా
చిక్కుముడులు వీడేదెన్నడో?
ఆదేశాలిచ్చినా పరిష్కారం కాని భూముల వ్యవహారం
ఆర్డీవోల వద్ద 60, డీఆర్వో ఆఫీస్‌లో
మరో 60 ఫైళ్లు పెండింగ్
సాకులు చూపుతూ
దరఖాస్తుల తిరస్కరణ!
22ఏ మాయాజాలం..
మహారాణిపేట: భూమి చేతిలో ఉన్నా.. హక్కులు అనుభవించలేని దుస్థితి. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా.. రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి. ప్రభుత్వ రికార్డుల్లో భూమి ఉన్నా.. ‘22ఏ’ నిషేధిత జాబితాలో పడితే చాలు అన్నీ కష్టాలే. ప్రభుత్వం 22ఏ సమస్యల పరిష్కారానికి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విశాఖ జిల్లాలోని పలు మండలాల్లో భూములకు ‘22ఏ’ చిక్కుముడిగా మారిందని భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్‌లో 120 ఫైళ్లు
విశాఖ జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. జిల్లా రెవెన్యూ కార్యాలయంలో సుమారు 60 ఫైళ్లు, ఇద్దరు ఆర్డీవోల వద్ద మరో 60 ఫైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో బాధితులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది పలు దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు సమాచారం.
జిరాయితీ భూములకూ తప్పని తిప్పలు
ప్రైవేటు (జిరాయితీ) భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత ఉన్న భూములపై ఆర్డీవో స్వయంగా విచారణ జరిపి జాబితా నుంచి తొలగించే అవకాశం కల్పించింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని భూయజమానులు వాపోతున్నారు. అసలు ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఎలా చేర్చారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
విలువైన భూములు 22ఏలోకి..
విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విలువైన భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ రూరల్, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, గాజువాక, పెందుర్తి తదితర మండలాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. నిషేధిత జాబితాలో చేరిన భూములను తిరిగి బయటకు తీసుకురావడం కష్టంగా మారిందని వాటి యజమానులు పేర్కొంటున్నారు.
సబ్ డివిజన్ లేక చిక్కులు
పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఒకే సర్వే నంబర్ కొనసాగుతుండటం కూడా సమస్యకు కారణమవుతోందని బాధితులు చెబుతున్నారు. పక్కనే ఉన్న భూములకు సబ్ డివిజన్ జరిగినా, కొన్ని భూములకు జరగకపోవడంతో అవి 22ఏలోనే కొనసాగుతున్నాయని అంటున్నారు. సర్వే నంబర్లకు సబ్ డివిజన్ చేస్తే అనేక భూములు నిషేధిత జాబితా నుంచి బయటపడే అవకాశం ఉన్నా.. ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమర్శిస్తున్నారు.
‘జీరో ఖాతా’తో రైతులకు ఇబ్బందులు
22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను జీరో ఖాతాల్లో చేర్చడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ 1బీలో నమోదు లేకపోవడంతో రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు 22ఏలోకి వెళ్లడం, జీరో ఖాతాల్లో నమోదు కావడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీజీఆర్‌ఎస్.. రెవెన్యూ క్లినిక్‌లే దిక్కు
22ఏ సమస్యల పరిష్కారం కోసం బాధితులు పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. పలువురు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలోనైనా అర్హత ఉన్న భూములను 22ఏ నుంచి తొలగించి, రికార్డులను సరిచేయాలని బాధితులు కోరుతున్నారు.
‘22ఏ’ ఫైల్ అంటేనే
వెనకడుగు!
రెవెన్యూ శాఖలో 22ఏ ఫైల్ అంటేనే ఒకరకమైన భయం నెలకొందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో పరిశీలించి పంపిన ఫైళ్లను సైతం కలెక్టరేట్‌లో తుది నిర్ణయానికి తీసుకురావడంలో జాప్యం జరుగుతోందని బాధితులు చెబుతున్నారు. గతంలో ఫైళ్లను పెండింగ్‌లో ఉంచేవారని, ప్రస్తుతం ఏదో ఒక కారణం చూపుతూ తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కాకపోగా బాధితులు మళ్లీ మొదటి నుంచి ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తోందని వాపోతున్నారు.


