మహేశ్వరం: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి సంబంధించిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హైకో ర్టు పలుమార్లు గడువిచ్చినా ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నగదుతో పాటు తులం బంగారం అందజేస్తామని హామీ ఇచ్చి మరిచారని విమర్శించారు. పేదల ప్రయోజనాలను కాపాడేలా కౌంటర్ దాఖలు చేసి పథకం నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డల ప్రయోజనాల కోసం నిరతంరం పోరాడుతామన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీఓ శారదమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు నర్సింహ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజు నాయక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ అంబయ్య యాదవ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య, పలు గ్రామాల సర్పంచ్‌లు నవీన్, పద్మ, కృష్ణవేణి, లింగం, సుజాత, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పథకాలు కొనసాగించాలి
ఆడబిడల్ల ప్రయోజనాల కోసం నిరంతర పోరాటం
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి


