కొడంగల్: గ్రావిటీ కెనాల్ కోసం భూములిచ్చిన రైతులను సోమవారం ఘనంగా సన్మానించారు. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా దౌల్తాబాద్ చెరువు నుంచి కొడంగల్ లిప్టు వరకు చేపట్టనున్న గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి కొడంగల్ మండల రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. కెనాల్ నిర్మాణం కోసం 27 ఎకరాల 27 గుంటల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంగీకార పత్రాలు సమర్పించిన రైతులను మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్‌లు శాలువా కప్పి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా నందారం ప్రశాంత్ మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రైతులు సహకరించడం అభినందనీయమన్నారు. వారి త్యాగం భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణంరాజు, కో ఆప్షన్ రమేష్‌బాబు, ఏఎంసీ డైరెక్టర్ ఆసిఫ్‌ఖాన్, జూనియర్ కృష్టంరాజు, బత్తుల నర్సింహ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.


