● భూ సేకరణకు సహకరించాలి
● బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
● తాండూరు ఆర్డీఓ అనిత
బొంరాస్‌పేట: సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతుల త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తాండూరు ఆర్డీఓ అనిత అన్నారు. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలువ నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చి సహకరించాలని రైతులను కోరారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు రూ.20 లక్షల చొప్పన నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. శుక్రవారం మండలంలోని చౌదర్‌పల్లి భూ సేకరణలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో 1,400 ఎకరాలు, దౌల్తాబాద్ మండలంలో 900 ఎకరాలు, బొంరాస్‌పేట మండలంలో 200 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి, నీటూరు, మాటూరు, కొడంగల్ మండలం పెద్దనందిగామ, దుద్యాల్ మండలం గౌరారం, హంసాన్‌పల్లి, బొంరాస్‌పేట మండలం చౌదర్‌పల్లి, తుంకిమెట్ల తదితర గ్రామాల మీదుగా కాలువ వెళ్తుందన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. భూగర్భ జలాలు పెరిగి సస్యశ్యామలం అవుతుందన్నారు. భూములు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి, ఇరిగేషన్ అధికారి కృష్ణమోహన్‌గౌడ్, ఆర్‌ఐ శిరీష, సర్పంచ్ కల్పనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


