తాండూరు రూరల్: నియోజకవర్గంలో నకిలీ డీఏపీ కలకలం రేపుతోంది. ఇప్పటికే పరిగి, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీని వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా.. శుక్రవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో నకిలీ డీఏపీ పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కరన్‌కోట్ పోలీసులు 89 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు ఏడీఏ అరుణ, పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం గ్రామంలోని పలువురి రైతుల ఇళ్లల్లో తనిఖీ చేశారు. 89 బస్తాలను స్వాధీనం చేసుకొని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజు, ఆత్కూర్‌కు చెందిన శివకుమార్ వీటిని విక్రయించినట్లు తేలింది. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రధాన సూత్రధారి పెద్దేముల్ వాసి
జిల్లాలో నకిలీ డీఏపీ విక్రయించడంలో పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజుగా పోలీసులు గుర్తించారు. పరిగి, యాలాల కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. చెంగోల్‌లో దాదాపు 200 బస్తాలు విక్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం 89 బస్తాలను స్వాధీనం చేసుకోగా మిగిలిన 111 బస్తాలను రైతులు పొలాల్లో వరి, పత్తి పంటలకు వాడినట్లు అధికారులు గుర్తించారు. రైతులు నకిలీ డీఏపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏడీఏ అరుణ, మండల అధికారి కొమురయ్య సూచించారు.
● 89 బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు
● చెంగోల్‌లో ఘటన


