● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్
● ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ మాట్లాడారు. ఏళ్ల తరబడిగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కళాశాల యాజమాన్యాలకు చెల్లించకపోవడంతో విద్యార్థుల ఉన్నత చదువులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే బకాయి పడిన రూ.8 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మధులత, జిల్లా నాయకులు వెంకటేష్, వీరమణి, బస్వరాజ్, జోసఫ్, రాజుగౌడ్, పరమేష్, తాండ్ర నరేష్, రాజు, రాము, కిరణ్, పలు కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


