అంచనాలు సిద్ధం చేశాం
వికారాబాద్: చేప పిల్లల పంపిణీకి మత్స్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిధులు కేటాయిస్తామని ప్రకటించడంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకూలంగా ఉన్న చెరువులను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అనుమతులు రాగానే టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది. జిల్లాలో మొత్తం 1,179 చెరువులు, కుంటలు ఉండగా 779 చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. 1.29 కోట్ల చేప పిల్లలు, 14.97 లక్షల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. 152 మత్స్య సహకార సంఘాలు.. 5,665 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువుల్లోకి నీరు చేరడం ప్రారంభమైంది. ఆగస్టు మొదటి రెండో వారంలో చేప పిల్లలు వదిలే అవకాశం కనిపిస్తోంది.
లక్ష్యానికి దూరంగా పంపిణీ
చెరువుల్లో చేపపిల్లలు వదిలే విషయంలో అధికారులు ఎంచుకున్న లక్ష్యానికి వదులుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోతోంది. ఏటా ఇదే తంతు కనిపిస్తోంది. ఎంచుకున లక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకే వదిలి చేతులు దులుపుకొంటున్నారు. ఈ ఏడాది అయిన చెరువుల్లో సరిపడా చేపపిల్లలు వదలాలని మత్స్య సహకరా సంఘాలు కోరుతున్నాయి.
నాసిరకం పిల్లలు
ఏటా నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మూడు నుంచి నాలుగు ఇంచులు ఉండాల్సిన పిల్ల ఒక ఇంచుకు మించి ఉండటంలేదని తెలిపారు. గతంలో ఇలాంటి వాటిని మత్స్యకారులు వెనక్కు పంపారు. అధికారులతో గొడవలు కూడా జరిగాయి. లక్ష చేప పిల్లల వదిలితే అందులో 50వేలు కూడా బతకడం లేదని తెలిపారు. సైజు కూడా రావడం లేదన్నారు. ఈ సారైనా. అధికారులు దృష్టి సారించి నాణ్యమైన చేపపిల్లలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వానికి చేరిన నివేదిక
జిల్లాలో మొత్తం చెరువులు 1,179
చేపలు వదిలేందుకు ఎంపిక చేసినవి 779
మత్స్య సహకార సంఘాలు 152,
సభ్యులు 5,665 మంది
జిల్లాలోని చెరువుల ఆధారంగా ఎన్ని చేప పిల్లలు అవసరం అనే దానిపై అంచనాలు సిద్ధం చేశాం. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపాం. ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. అనుమతులు రాగానే టెండర్ ప్రక్రియను ప్రారంభించి చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తాం.
– వెంకయ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి


