మండలం వర్షపాతం
మర్పల్లి 20
మోమిన్‌పేట్ 29.8
నవాబుపేట 29
వికారాబాద్ 37.1
పూడూరు 43.4
పరిగి 33.3
కుల్కచర్ల 36.7
దోమ 24.3
బొంరాస్‌పేట్ 42.8
ధారూరు 42
కోట్‌పల్లి 19.6
బంట్వారం 13.8
పెద్దేముల్ 32.8
తాండూరు 29.2
బషీరాబాద్ 49.8
యాలాల 43.1
కొడంగల్ 37.6
దౌల్తాబాద్ 43.2
చౌడాపూర్ 30
దుద్యాల్ 36.8
వికారాబాద్: రెండు రోజుల క్రితం ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. జన జీవనం స్తంభించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వస్తోంది. వాగులు తీవ్ర రూపం దాల్చడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో ఆరు మండలాల్లో 40 మిల్లీ మీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. రెండు రోజుల క్రితం వరకు 15 మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా ప్రస్తుతం అధికం, అత్యధిక వర్షపాతం నమోదైంది.
అప్రమత్తమైన యంత్రాంగం
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. 50కి పైగా ప్రమాద ప్రదేశాలను గుర్తించి వాటి వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. వానలు తగ్గే వరకు ఎవరూ బయటకు రావొద్దని, ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధారూరు మండలం కోట్‌పల్లి ప్రాజెక్టుకు, పరిగి మండలం లఖ్నాపూర్‌కు, యాలాల మండలం జుంటుపల్లి, శివసాగర్, వికారాబాద్ మండలం శివారెడ్డిపేట్ ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది.
దెబ్బతిన్న రోడ్లు
కాగ్నా, మూసీ, ఈసీ నదులు ఉధృతగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు పొలాల్లోకి వెళ్ల లేని పరిస్థితి నెలకొంది.
● ధారూరు మండలం దోర్నాల, రుద్రారం, నాగసముందర్, పరిగి, గొడుగోనిపల్లి, గెర్‌గేట్‌పల్లి మార్గాల్లో వాగులు తీవ్ర రూపం దాల్చాయి. పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
● వికారాబాద్ – పరిగి మార్గంలో చిట్టెంపల్లి వద్ద తాత్కాలిక రోడ్డుకు గండి పడింది.అధికారులు, పోలీసులు మరమ్మతులు చేయించి రాకపోకలను పునరుద్ధరించారు. నవాబుపేట మండలం మూలమడ వాగుపై గల బ్రిడ్జికి ఓ వైపు గండి పడటంతో పోలీసులు దగ్గరుండి మరమ్మతులు చేయించారు.
● తాండూరు నియోజకవర్గంలో కగ్నా పరవళ్లు తొక్కుతోంది. బషీరాబాద్, యాలాల, తాండూరు మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది.
● భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. సహాయం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నంబర్ 8712670056 లేదా డయల్ 100కు కాల్ చేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
పారుతున్న వాగులు, వంకలు
చెరువుల్లోకి చేరుతున్న వరదనీరు
పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు
రాకపోకలకు తీవ్ర అంతరాయం
పలు మండలాల్లో లోటు నుంచి
అధిక వర్షపాతం


