అనంతగిరి: కళాశాలలకు వెళ్లే సమయంలో బస్సు లు రావడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శనివారం వికారాబాద్ బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. సమయానుకూలంగా సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ విద్యార్థులకు మద్దతు తెలిపి మాట్లాడారు. వికారాబాద్ డిపో నుంచి హైదరాబాద్‌కు కళాశాలల సమయంలో బస్సులు నడపాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు గతంలో మాదిరిగానే బస్సులు నడపాలన్నారు. కొన్ని రోజుల నుంచి సకాలంలో బస్సులు రాకపోవడం, పలు సర్వీస్‌ను తగ్గించడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం బస్సులు లేక కళాశాలకు గంట ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందన్నారు. సాయంత్రం అటు నుంచి వికారాబాద్‌కు సర్వీసులు లేక అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. ఇంటికి వచ్చే సరికి రాత్రి 7 నుంచి 8గంటలు అవుతుందని, దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్టాండ్‌కు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.


