బషీరాబాద్: మండలంలోని నావంద్గీ ఇసుక రీచ్‌లో తవ్వకాలను నిలిపివేసి, రీచ్‌ను రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సర్పంచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కాగ్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, భారీగా రవాణా కొనసాగుతుండటంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వందలాది బోరుబావులు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గిందని, లిఫ్ట్ ఇరిగేషన్ బావిలో నీటి లభ్యత పడిపోవడంతో మూతపడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక రవాణా వలన దారులు దెబ్బతినడంతోపాటు దుమ్ము, కాలుష్యంతో వెదజల్లుతోందని తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామసభ తీర్మాన ప్రతిని తహసీల్దార్ షాహేదా బేగం, గనుల శాఖ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో వేణుపట్వారీ, ప్రతాప్‌రెడ్డి, భీంరెడ్డి, వీరణ్ణ, మహేందర్, కిష్టప్ప, నక్క నరేష్, జగదీశ్, వెంకట్‌రెడ్డి, అన్వర్‌మియా, నర్సింలు, కొండారెడ్డి, మల్లారెడ్డి, బిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


