● చుట్టపుచూపుగా రాకపోకలు
● పరిష్కారం కాని ప్రజా సమస్యలు
● కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
బషీరాబాద్/ధారూరు: ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి నామమాత్రంగా సాగుతోంది. సోమవారం బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమానికి రెవెన్యూ శాఖ నుంచి జూనియర్ అసిస్టెంట్ కృష్ణ, మండల పరిషత్ సూపరింటెండెంట్ విజయకుమారి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి మాత్రమే హాజరయ్యారు. వీరు కూడా మూడు గంటల అనంతరం వెళ్లిపోయారు. వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదు దారులు అధికారుల కోసం గంటల తరబడి ఎదురుచూసి నిరాశతో వెనుదిరిగారు.
రాని అధికారులు
మండల గృహనిర్మాణ శాఖ, విద్యాశాఖ, ప్రభుత్వ ఆస్పత్రి, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ, ఉపాధి హామీ, పౌర సరఫరాలు, పోలీస్, అటవీ, సహకార, మార్కెటింగ్, రోడ్లు– భవనాలు, నీటిపారుదల శాఖల అధికారులు హాజరుకాక పోవడంతో ప్రజావాణి ఉద్దేశం ప్రశ్నార్థకంగా మారిందని పులువురు ఆరోపిస్తున్నారు. ప్రతి వారం పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని తెలిపారు.
ధారూరులో...
ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజావాణి.. కొందరు అధికారుల నిర్లక్ష్యానికి వెలవెలబోతోంది. సకాలంలో అధికారులు హాజరు కాకపోవడంతో వెనుదిరుగుతున్నామ ని కొందరు ఫిర్యాదు దారులు ఆరోపిస్తున్నారు. సోమవారం ధారూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి ఎంపీడీఓ, ఏపీఓ మినహా.. ఇతర శాఖల అధికారులు సకాలంలో రాలేదని పలువురు పేర్కొన్నారు. ఐకేపీ పీఎం, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూస్, ఆర్‌అండ్‌బీ, అటవీ, ఆరోగ్య, పీఆర్ తదితర శాఖల అధికారులు అసలే రావట్లేదని ఆరోపించారు. చుట్టపు చూపుగా వస్తున్న అధికారుల వలన తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, అధికారులు అందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


