బొంరాస్‌పేట: రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రదర్శనలకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఒగ్గు కళాకారులు కోరారు. ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలో భాషాసాంస్కృతికశాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. వీరిలో ఒగ్గుడోలు కళాకారుల జిల్లా నాయకుడు ఒగ్గుబీరు తదితరులు ఉన్నారు.
ఉర్దూలో పేరు రాయించాలి
కొడంగల్ రూరల్: ఉర్దూను అధికారిక భాషగా గుర్తించినా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల బోర్డులపై ఉర్దూలో పేర్లు రాయించకపోవడం సరైందికాదని ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్‌బి.గుల్షన్ అన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సముదాయం బోర్డుపై ఉర్దూ భాషతో పేరు రాయించకపోవడంపై మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. హెచ్‌ఎం రాంరెడ్డి బోర్డుపై ఉర్దూలో పేరు రాయిస్తామని చెప్పినట్లు ఎంఐఎం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సర్తాజ్ హుస్సేన్, తాజుద్దీన్, షేక్ అహ్మద్, ఖాలిద్, నజీర్, అక్తార్ తదితరులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై
ఎస్‌ఓటీ దాడులు
పరిగి: పరిగి మార్కెట్ కమిటీ దుకాణ సముదాయం పేకాట స్థావరంగా మారింది. మంగళవారం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,600 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కొంత కాలంగా మార్కెట్ కమిటీ సముదాయంలో పేకాట నడుస్తున్నట్లు స్థానికులు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి స్థానిక ఎస్సై మోహనకృష్ణను వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
18 ట్రాక్టర్ల ఇసుక సీజ్
బొంరాస్‌పేట: మండలంలోని మహంతీపూర్ సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను మంగళవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 18 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశామని, బుధవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శిరీష తెలిపారు.
డైరెక్టర్ పదవికి రాజీనామా
● సీఈఓకు లేఖ అందజేసిన
వెంకటయ్యగౌడ్
● కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి
కృషి చేస్తానని వెల్లడి
కుల్కచర్ల: కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పెంటమీది వెంకటయ్యగౌడ్ వారం రోజుల క్రితం తనికిచ్చిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఈ లేఖను ఇన్‌చార్జ్ సీఈఓ అలీంకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధికారంలో లేనన్ని రోజులు కష్టపడి పనిచేశామన్నారు. తీరా పదవుల అంశం వచ్చేసరికి బీసీలను బానిసలుగానే పరిగణించారని ఆవేదన వ్యక్తంచేశారు. ముప్పై ఏళ్లపాటు పార్టీ బలోపేతానికి కృషిచేశానని, మరో పార్టీవైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలిపారు.


