తాండూరు టౌన్: బంగారం దుకాణ వ్యాపారులపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పలువురు బంగారు దుకాణాల యజమానులు పేర్కొన్నారు. ఈ మేరకు జీపీ, పవన్, మహాలక్ష్మి జ్యుయెల్లర్స్ యజమానులతో పాటు పలువురు వ్యాపారులు విలేకరులతో మాట్లాడారు. 24 క్యారెట్ల బంగారానికి బదులుగా 18 క్యారెట్ల బంగారాన్ని కట్టబెట్టారని టిప్పు అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. చిన్నచిన్న ఆభరణాలకు 24 క్యారెట్ల బంగారాన్ని కాకుండా 20 లేదా 18 క్యారెట్ల బంగారాన్నే వినియోగిస్తారన్నారు. తమ వ్యాపారాలను దెబ్బతీయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించిన టిప్పు అనే వ్యక్తిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. అకారణంగా తమను టార్గెట్ చేస్తే వ్యాపారాలు బంద్ చేసి ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.


